Jeevans || jeevankumar ||

Thursday, 9 November 2017

వేయిపడగలు – శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ( శ్రీవల్లీ రాధిక గారి సమీక్ష )

రాసినవారు: టి.శ్రీవల్లీ రాధిక
***************
పాతికేళ్ళ క్రితం చదివినపుడు ఈ పుస్తకం చాలా నచ్చడం.. దాని గురించి స్నేహితురాళ్ళతో పదేపదే చెప్పడం లీలగా గుర్తుంది. అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ చదువ తలపెట్టినపుడు అదే ఉత్సుకతతోనూ, వేగంతోనూ చదవగలనని అనుకోలేదు. ఆశ్చర్యకరంగా వేయిపేజీల ఈ పుస్తకాన్ని నాలుగురోజులలో పూర్తి చేయడమే కాదు చదువుతున్నపుడు, చదివాక కూడా గొప్ప సంతృప్తిని పొందాను.
ఈ పుస్తకంలో రచయిత ఎన్నో విషయాలు చర్చించారు. కళలు, ఆచారాలు, సంప్రదాయాలు, కులాలు, మతాలు,విద్యా విధానాలూ, వైద్యం, తాత్వికత – వీటన్నిటి గురించీ ఆయన చేసిన వ్యాఖ్యలూ,విమర్శలూ ఆ అభిప్రాయాలు నచ్చని వారికి తిరోగమనమనిపించవచ్చు. మార్పుని ఒప్పుకోలేకపోవడమనిపించవచ్చు. కానీ రచయిత మంగమ్మ అనే పాత్ర ద్వారా చెప్పించిన ఈ క్రింది వాక్యాన్ని అర్ధం చేసుకుంటే ఆ అపోహలన్నీ తొలగిపోతాయి.

“.. సంఘములో కానీ, మతములో కాని, మరొకదానిలో కాని, మీరెన్ని మార్పులైన తేవచ్చును. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తద్వారా భక్తియో, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము. “
– ఈ వాక్యం రచయిత భావాలనీ, ఈ పుస్తకాన్నీ అర్ధం చేసుకోవడానికే కాదు మనజీవితంలో ఎదురయే మార్పులని అర్ధం చేసుకోవడానికీ, అంగీకరించడానికీ కూడా ఉపయోగించుకోగల మంచి సాధనం అనిపించిపింది నాకు.
36 అధ్యాయాలున్న ఈ నవలలో మొదటి మూడు, నాలుగు అధ్యాయాలు చదివేసరికే అన్ని పాత్రలపట్లా ఆసక్తి కలుగుతుంది. ఇక అయిదో అధ్యాయంలో ధర్మారావు, గిరికల మధ్య జరిగే ఈ క్రింది సంభాషణ చదివేసరికి ఆ పాత్రల పట్ల ఆకర్షణ కొండలా పెరుగుతుంది.
……
ధర్మా : భక్తియోగులకు కృష్ణస్వామి సులభుడు. జ్ఞానయోగులకు శివుడు సేవనీయుడు.
గిరిక : సేవనీయుడందువేమి? సులభుడు కాదా!
ధర్మ : తల్లీ, జ్ఞానయోగము సులభము కాదు.
నిజానికి నవలలో ఈ సంభాషణని ప్రవేశపెట్టిన తీరే చాలా గొప్పగా వుంది. నేరుగా ధర్మారావు, గిరిక మాట్లాడుకుంటున్నట్లుగా చదవము మనమీమాటలని. అంతకుముందు రెండు పేజీలలో రుక్మిణమ్మారావుగారి వ్యక్తిత్వాన్ని వర్ణించి, ఆవిడ ఆకర్షణలో మనల్ని ముంచి, ఆ తర్వాత ఆవిడతో పాటు మనల్ని గుడికి తీసుకువెళ్ళి అక్కడ…ఆవిడని అబ్బురపరిచే విధంగా ధర్మారావు, గిరికల మధ్య ఈ సంభాషణ వినిపిస్తారు రచయిత. వాళ్ళు మాట్లాడుకుంటుంటే రుక్మిణమ్మారావుగారు వింటారు. ఆవిడతో పాటు మనమూ వింటాం. గిరిక వివేచనాశక్తికి రాణిగారు అబ్బురపడినట్లే మనమూ అబ్బురపడతాం.
సంభాషణలని ఎంచుకున్న తీరూ, వాటిని కథలో ప్రవేశపెట్టిన తీరు, వాటిద్వారా పాత్రలని చిత్రించిన తీరూ.. చాలా బాగున్నాయి. ఉదాహరణకి ఇందులో హీరో ధర్మారావు చాలా విషయాలు చెప్తుంటాడు. అతని చుట్టూ వున్నవారూ, స్నేహితులూ .. అతనితో విభేదించేవాళ్ళూ కూడా వాటిని గౌరవంగానే వింటూ వుంటారు. అయితే ఇది అసహజంగా అనిపించకపోవడానికి కారణం .. తాను మాట్లాడే విషయం పట్ల ధర్మారావుకి వున్న స్పష్టత. ఆ స్పష్టతని కూడా మనకి చాలా నేర్పుగా తెలియచెప్తారు రచయిత.
ధర్మారావు మాటలని ప్రశంసిస్తూ తొలిపరిచయంలో అతని సవతి అన్న రామచంద్రరాజు ‘చక్కగా మాటాడితివి. ఎట్లయినను చదువుకొన్న దారి వేరు.’ అంటాడు, ధర్మారావు బాగా మాట్లాడడాన్ని అతని బి.ఏ చదువుకు ఆపాదిస్తూ.
ఆ ప్రశంసకి బదులుగా, ‘ఇంగ్లీషు చదువుకొనుట వలన కాదు నేనిట్లు మాటాడునది.” ఆన్న సమాధానం సూటిగా వస్తుంది ధర్మారావు నుంచి.
ఇష్టం లేకుండా చదివిన చదువుల పట్లా, అనాసక్తితో సాధించిన ప్రతిభల పట్ల కూడా మనుషులకి మోహమూ, గర్వమూ వుండడం మనం సాధారణంగా చూసే విషయం. అందుకు అతీతంగా వున్న ధర్మారావు వ్యక్తిత్వాన్ని ఈ చిన్ని సంభాషణ సమర్ధవంతంగా చూపిస్తుంది.
సంభాషణలే కాదు.. రచయిత వ్యాఖ్యలు కూడా చాలా చోట్ల పదిపేజీల భావాల్ని ఒకటి రెండు చిన్న వాక్యాలలో చెప్పేస్తాయి.
జమీందారు రంగారావు, మొదటిభార్య చనిపోయాక లండన్ నుంచి శశిని (సుసానీ) అనే దొరసానిని భార్యగా తెచ్చుకుంటాడు. ఆ అధ్యాయం ఈ క్రింది వాక్యాలతో ముగుస్తుంది.
…శశిని వచ్చినది.! రంగారావుకు భార్యయే. భార్యయా? కోటకు రాణియా? హరప్పకు తల్లియా? స్వామికి ఏకాదశులుండునా?
-దాదాపుగా అన్ని అధ్యాయాలూ ఇలా ఒక ఆలోచనాత్మకమయిన వ్యాఖ్యతోనో, చలోక్తి తోనో ముగుస్తాయి.
ఇక ఎన్నో తాత్విక విషయాలు కథలో అలవోకగా కలిసిపోయి కనిపిస్తాయి.
* “..ప్రతివ్యక్తియందును సృష్టిలోనున్న సర్వశబ్దము బీజరూపమున సన్నిహితమై వుండును. తచ్చబ్దానుభవ మతని సూక్ష్మ శరీరికి కలదు. కాని స్థూలశరీరికి లేదు. సంగీతము వినుచుండు తన్మయత్వ స్థితిలో మనమందరమాసూక్ష్మ శరీరికి దగ్గరగా వుండి, అతడెరిగిన సర్వశబ్దానుభవము పొందుచుందుము. అందుకనియే ఆనందము పొదుచుందుము. ఆనందము ఆ సూక్ష్మశరీరి లక్షణములలోనొకటి.”
* “ఆత్మలో భేదము లేదు. జీవునిలో భేదమున్నది. …. … అట్లే ఆత్మ భిన్నోపాధిగతమై భిన్నత్వము తెచ్చుకొనుచున్నది. తదుపాధిగత గుణదోష సంక్రాంతి చేత జీవుడు భిన్నుడగుచున్నాడు.”
ఒకవైపు యిలాంటి తాత్వికమయిన విషయాలు నవలలో ఇమిడిన తీరు అద్భుతంగా తోస్తే, మరోపక్క లోకరీతిని గురించిన, ఉద్యోగాలు .. అధికారులను గురించిన కొన్ని వ్యాఖ్యలు “ఎంత నిజం!” అనిపించాయి.
* అన్నిమతములకు అదొకరీతిగా ముడిపెట్టుట, అన్ని మతములందును యాదార్ధ్యమున్నదనుట, ఎచ్చట మంచి యున్నదో అచ్చట గ్రహించవలయుననుట , దేనియందును నిశ్చయ జ్ఞానములేక “ఇతో భ్రష్ట స్తతో భ్రష్ట:” యగుట – బ్రతుకుతెరువునకు ముఖ్యధర్మము.
* ……ఒక కచేరీలో ఒక గుమాస్తా ఒక తప్పు చేసెననుకొందము. ఆపైని గల అధికారి యా తప్పులను సర్ది “నాయనా! ఇట్లు చేయరాదు!” అని దిద్దినచో ఆ దోషమంతటితోనే యంతరించును. …
నవలలో ఎక్కువ భాగం అభిప్రాయాలు, వ్యాఖ్యలూ ధర్మారావు పాత్ర ద్వారానే చెప్పబడ్డాయి. అయితే అంత మాత్రం చేత ధర్మారావు పాత్ర మిగతా పాత్రలని డామినేట్ చేసినట్లు కనబడదు. నిజానికి ఈ నవలలో నాకు గొప్పగా అనిపించిన విషయాలలో ఇది కూడా ఒకటి. రచయిత ధర్మారావు ఆలోచనలలో వున్న స్పష్టతని చూపారే తప్ప ధర్మారావు వ్యక్తిత్వం మిగతా వారి వ్యక్తిత్వం కంటే ఉన్నతమయినదని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇది ఒకరకంగా రచయిత ఆత్మకథ అనీ, ధర్మారావు పాత్ర ఆయనదేనని విన్నపుడు ఈ గౌరవం మరింత పెరుగుతోంది. తాను చేస్తున్న రచనలో తన పాత్రని మహోన్నతంగా చూపించే బలహీనత లేకపోవడం గొప్ప విషయం కదా!
చాలా విషయాలమీద ధర్మారావు వ్యాఖ్యానాలు చేస్తాడు. లలితకళలన్నిటి గురించీ ఎన్నో అభిప్రాయాలూ, ఆసక్తికరమయిన విషయాలూ చెప్తాడు. అభినయంలో వున్న భేదాలు, ఆహార్యంలో, పాత్రపోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలూ, పతాక మొదలయిన ముద్రలు, వాటి విశిష్టత. సాహిత్యం విషయానికొస్తే… ఒకచోట పింగళి సూరన కవిత్వాన్నీ, రామలింగడి కవిత్వాన్నీ పోల్చి చూసి వ్యాఖ్యానిస్తే, మరో చోట ఆముక్తమాల్యదలోని సొగసు గురించీ, ఇంకొక చోట ప్రభంధాలనెలా అర్ధం చేసుకోవాలన్న విషయాన్ని గురించీ….కథాచమత్కారము అంటే ఏమిటన్న విషయం గురించీ – ఇలా ఎన్నో విషయాలు.
అలాంటి వ్యాఖ్యల్లో కొన్ని ఎక్కువమందికి అసంబద్ధంగా అనిపించేవీ, విమర్శకు గురయ్యేవీ కూడా వున్నాయి. ఉదాహరణకి ధర్మారావు “భోగముదానికిచ్చిన డబ్బు మోటారుకొన్నదానికన్న చెడిపోయినదా!” అనుకుంటాడోచోట. ఆలోంచించినకోద్దీ లోతు కనిపించిందీ వ్యాఖ్యలో. రెండూ అలవాటు లేనివాళ్ళకి రెండూ ఒకటేనని అనిపించడం సమంజసమే కదా! అయితే ఇంత బాహాటంగా ఈ అభిప్రాయాన్ని ధర్మారావు ఆలోచనల ద్వారా మనకి చెప్పిన రచయిత.. ఈ ఆలోచన తర్వాత ధర్మారావు ” ఇంటిలో పండుకొని అనుకొనుచున్నాను గనుక సరిపోయినది” అనుకున్నట్లు వ్రాయడం చూస్తే రచయిత గడసరితనానికి ముచ్చటేసింది.
తాత్వికతా, లోకరీతే కాదు, శృంగారమూ, భార్యాభర్తల మధ్య అనురాగమూ కూడా అద్భుతంగా వర్ణింపబడ్డాయి ఈనవలలో. భార్య చనిపోయేముందు ఆమె చీరలున్న పెట్టె తెచ్చేందుకు ధర్మారావు ఆమె పుట్టింటికి వెళ్ళిన సన్నివేశం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది.
ఇలాంటి కొన్ని సన్నివేశాలు, భావాలు చాలా సున్నితంగా రచించారు. కిరీటి (ధర్మారావు స్నేహితుడు) తన తల్లి మరణం తర్వాత తన బాధను ధర్మారావుకి చెప్పుకుంటూ
“.. దేవాలయములోనికి పోయితిని. సాయంకాలమగుట చేత స్త్రీపురుషులు దేవాలయములోనికి ప్రవాహముగా వచ్చుచు పోవుచుండిరి. తల్లిపోయినవాడని నన్నొక్కరాదరించలేదు. సర్వజీవలోకము నాయందంత నిర్దయమేలయైనదో!” అంటాడు. అది చదివితే ఒక సంఘటనకి మనసు ఎలాస్పందిస్తుందనే విషయాన్ని ఈ రచయిత ఎంత సున్నితంగా, సునిశితంగా గమనించారో కదా! అనిపించింది.
ఫక్కున నవ్వు తెప్పించే చలోక్తులూ కోకొల్లలు ఈ నవలలో. ధర్మారావు బయటకు వెళ్ళబోతూ భార్యతో “మధ్యాహ్నపుపూట కొంచెము ఫలహారమైనను పెట్టవుగదా!” అంటాడు. వెంటనే అరుంధతి “నేడు ప్రొద్దుపోయినగాని రారా ఏమిటి?” అంటుంది.
ఆ ప్రశ్న విని ధర్మారావు “ఈనాటి కవులకు ఈమాత్రమైనను ధ్వని తెలియదు ” అంటాడు.
మరోచోట రామచంద్రరావనే ఆయన “డాక్టరు పరీక్ష చదువుటకు ఇంగ్లండు పోవుచున్నాను” అంటాడు. “ఎందులో డాక్టరు” అంటే “తెలుగు పరొశోధనాశాఖలో” అంటాడు.
దానికి కుమారస్వామి “తెలుగు పరిశోధనకింగ్లాండు పోవుచున్నారా? టిబెట్టు పోరాదా?” అని స్పందిస్తాడు.
ఇంకా ఈ నవలలో కొన్ని పోలికలు, ఉపమానాలు కూడా నాకు బాగా నచ్చాయి. ఉదాహరణకి ఒకటి.
ఒక సంప్రదాయము చచ్చిపోవుచు, చావులో కూడ దాని లక్షణమైన మహౌదార్యశ్రీనే ప్రకటించును. మరియొక సంప్రదాయము తాను నూత్నాభ్యుదయము పొందుచు, అభ్యుదయములో కూడా దాని లక్షణమైన వెలతెలపోవుటయే ప్రకటించును. వేసగినాటి అస్తమయము కూడ తేజోవంతమే. దుర్దినములలోని యుదయము కూడ మేఘాచ్చాదితమే.
ఏ రచన చదివినా లోపాలను ముందు పసిగట్టడం, ఆ గోలలో పడి ఇక రచనలోని సొగసును ఆనందించలేకపోవడం నా బలహీనత. కానీ ఈనవల నాకా అవకాశాన్నీ, బాధనీ కలిగించలేదు. ఈ నవలలో నేను పట్టుకోగలిగింది ఒకేఒక్క పొరపాటు.

శ్రావణశుద్ధ ఏకాదశినాడు రుక్మిణమ్మారావుగారు ఉపవాసముండడం, ధర్మారావుని పిలిచి భాగవతం చదివించుకోవడం .. ఆ తర్వాత రెండ్రోజులకి ధర్మారావు తన కార్యానికి లగ్నం పెట్టించుకోవడం.., పదిరోజుల తర్వాత కుదిరిన ఆ లగ్నం “శ్రావణశుద్ధ దశమి” అవడం – ఇదొక్కటే నేను కనిపెట్టిన పొరపాటు ఈ నవలలో.

Sunday, 5 November 2017

Demo Project on Web Portal for NGRI (Basic Idea)


Demo Project on Web Portal for NGRI  (Basic Idea)

My Project Incident analysis (ClientSideApplication)



Type of File : Video
Project Name : Incident Analysis
Purpose : Idea Demo  before  Deployment on Live Server
Client : UP -Police
Technologies Used : .Net . ( C#) ,java script ,SQL Sever , Ajax 


Geo-spatial  related : Plotting lat, long points as Markers, Heatmaps ,Clustering  using leaflet on open street Maps (OSM)